Chandrababu: అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల విలువైన పనుల పురోగతిని ముఖ్యమంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక వసతులతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణంపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించే క్రమంలో ఎదురైన సవాళ్లను, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించిన తీరును అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాజధానిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... "రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ కాదు. ఈ బృహత్కార్యంలో పాలుపంచుకుంటున్న మీరంతా చరిత్రలో భాగస్వాములు అవుతున్నారు. ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉండొచ్చు, కానీ ఒక రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు" అని అన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి ‘ఫ్యూచర్ సిటీ’గా నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు.

ప్రతి నిర్మాణ సంస్థ నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు, నెలవారీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఎంత మంది కార్మికులు, ఎంత యంత్ర సామగ్రి అవసరం, ప్రస్తుతం ఎంత వాడుతున్నారనే వివరాలను ఆరా తీశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పూర్తి చేయాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత, వ్యయ నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక టెక్నాలజీ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. పనుల పూర్తి కోసం అవసరమైతే మానవ వనరులను పెంచుకోవాలని, ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Chandrababu
Amaravati
Andhra Pradesh
Capital City Construction
CRDA
AP Secretariat
AP Assembly
High Court
Infrastructure Projects
Future City

More Telugu News