Kanimozhi: డీఎంకేలో వారసత్వ చిచ్చు.. ఉదయనిధికి పోటీగా కనిమొళి!

తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో వారసత్వ పోరు బహిర్గతమైంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తుండగా, ఆయన సోదరి, ఎంపీ కనిమొళి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.

ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్‌లో జరిగిన ప్రచార సభలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది. డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు కనిమొళి వేదిక వద్దకు రాగానే, ఆమె మద్దతుదారులు ‘కాబోయే సీఎం కనిమొళి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఊహించని స్పందనకు ఆమె ఆశ్చర్యపోయినా, మౌనంగానే ఉండిపోయారు. పార్లమెంటులో చురుకైన గొంతుకగా, క్షేత్రస్థాయిలో బలమైన నాయకురాలిగా ఆమెకు ఉన్న గుర్తింపు ఈ రూపంలో బయటపడింది.

కనిమొళికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే అసంతృప్తి ఆమె వర్గంలో ఉంది. దీనికి బలం చేకూర్చేలా, దక్షిణ తమిళనాడులో కనిమొళికి సమాచారం ఇవ్వకుండానే ఉదయనిధి పర్యటనలు ఖరారు చేయడం వివాదానికి దారితీసింది. ప్రొటోకాల్ పాటించలేదని కనిమొళి వర్గం అభ్యంతరం చెప్పడంతో, తిరునెల్వేలి, కోవిల్‌పట్టిలో జరగాల్సిన ఉదయనిధి యువజన విభాగ సమావేశాలు చివరి నిమిషంలో రద్దయ్యాయని సమాచారం.

ఒకవైపు కుమారుడిని తన వారసుడిగా నిలబెట్టాలనే ప్రయత్నం, మరోవైపు క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న సోదరి.. ఈ ఇద్దరి మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు స్టాలిన్‌కు రాజకీయంగా పెద్ద సవాల్‌గా మారింది. ఈ వారసత్వ పోరు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Kanimozhi
DMK
MK Stalin
Udhayanidhi Stalin
Tamil Nadu Politics
Succession battle
Political rivalry
South India politics

More Telugu News