Khawaja Asif: ఇంట్లోకి చొరబడి కొడతాం: భారత్‌కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

Khawaja Asif Warns India of Cross Border Attack
షార్ట్స్‌లో చూడండి
భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. భారత భూభాగంలోకి చొరబడి దాడులు చేస్తామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే అది గతంలోని పరిమితులకు లోబడి ఉండదని, తాము భారత సరిహద్దులు దాటి వస్తామని ఆయన స్పష్టం చేశారు.

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "వారు (భారత్) మళ్లీ ప్రయత్నిస్తే, గతేడాది కన్నా తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటారు. ఈసారి ఘర్షణ 200 నుంచి 250 కిలోమీటర్లకే పరిమితం కాదు. మేం వారి భూభాగంలోకి ప్రవేశించి, వారి ఇంట్లోకి చొరబడి మరీ కొడతాం" అని ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పొరుగు దేశం పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, మునుపెన్నడూ లేనివిధంగా నిర్ణయాత్మక చర్యలు తప్పవని హెచ్చరించారు. 2025 ఏప్రిల్‌లో 26 మంది మృతికి కారణమైన పహల్గాం ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందని ఆయన గుర్తుచేశారు.

"ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత బలగాలు కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ను చిత్తు చేశాయి. ఆ ఆపరేషన్ ఇంకా ముగియలేదు. పాకిస్థాన్ మళ్లీ అలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే, మన సాయుధ బలగాలు వారు ఎప్పటికీ మరిచిపోలేని గట్టి సమాధానం ఇస్తాయి. ఈసారి తీసుకునే చర్యలు అపూర్వంగా ఉంటాయి" అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి నుంచి ప్రతిస్పందన వచ్చింది.
Go Back to Shorts
Khawaja Asif
Pakistan
India
Rajanth Singh
India Pakistan conflict
Cross border attack
War threat
Operation Sindoor
Terrorist attack
Pahalgam attack

More Telugu News