Cooking Oil Prices: వంటింట్లో మంట.. చుక్కలు చూపిస్తున్న నూనెల ధరలు

గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తూ వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం వరకు రూ.150గా ఉన్న లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర, ఇప్పుడు బ్రాండ్‌ను బట్టి రూ.190 నుంచి రూ.202 వరకు పలుకుతోంది. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉంది.

ఈ ధరల పెరుగుదల కేవలం సన్‌ఫ్లవర్ నూనెకే పరిమితం కాలేదు. దాదాపు అన్ని రకాల నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. వేరుశనగ నూనె లీటర్ ధర రూ.220కి చేరగా, పామాయిల్ ధర రూ.150కి, ఆవనూనె ధర రూ.190కి పెరిగింది. దీనికి తోడు రూపాయి విలువ పతనం కావడం కూడా ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది.

భారత్‌కు అవసరమైన సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఎక్కువ భాగం రష్యా, ఉక్రెయిన్ నుంచే దిగుమతి అవుతుంది. అయితే గల్ఫ్ యుద్ధం కారణంగా నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. సరఫరాలో ఇబ్బందులు, పెరిగిన రవాణా భారం కారణంగా దిగుమతిదారులు ధరలను పెంచడంతో రిటైల్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది.

ధరల భారం తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు బదులుగా చౌకగా లభించే పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల రానున్న ఆర్థిక సంవత్సరంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలు 10 శాతం వరకు తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. మరోవైపు, దేశంలో నూనె నిల్వలు కూడా 45 రోజులకు సరిపడా ఉండాల్సినవి, ప్రస్తుతం 20-30 రోజులకు పడిపోయాయి.

ఈ యుద్ధం సెగ కేవలం వంట నూనెలకే పరిమితం కాలేదు. సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగడంతో, త్వరలో వాటి ధరలు కూడా 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు ధరలు పెంచకుండా ప్యాకెట్ల సైజును తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Cooking Oil Prices
Sunflower Oil
Edible Oil Price Hike
Russia Ukraine War Impact
Palm Oil
Groundnut Oil
Mustard Oil
Indian Economy
Inflation

More Telugu News