Shreyas Iyer: సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై!

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో పంజాబ్‌కు సునాయాస విజయం దక్కింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్‌కు చెన్నై బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా యువ ఆటగాడు అయూష్ మాత్రే (73; 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబే (45*; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (32; 12 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశ్యాఖ్ రెండు వికెట్లు తీయగా, బార్ట్‌లెట్, జాన్సెన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. అతని ధాటికి పంజాబ్ పవర్‌ప్లేలోనే 68 పరుగులు రాబట్టింది. అనంతరం ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43), కూపర్ కనోలీ (36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన అర్ధశతకంతో జట్టును విజయానికి చేరువ చేశాడు. చివర్లో శశాంక్ సింగ్ (14*), మార్కస్ స్టోయినిస్ (9*) లాంఛనాన్ని పూర్తి చేయడంతో పంజాబ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 

చెన్నై బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ రెండేసి వికెట్లు తీసినా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. సొంతగడ్డపై భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్ల వైఫల్యంతో చెన్నైకి నిరాశే ఎదురైంది. 

కాగా, చెన్నై జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. గువాహటిలో జరిగిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో  ఓడిపోయిన సీఎస్కే... ఇవాళ సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లోనూ పరాజయం చవిచూసింది. 
Shreyas Iyer
Chennai Super Kings
Punjab Kings
IPL 2026
Ayush Matre
Shivam Dube
Priyansh Arya
Cricket
T20
MS Chidambaram Stadium

More Telugu News