Revanth Reddy: పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేరళలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర సర్కారుపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి, సామాజిక పురోగతి గురించి కేరళకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేరళ సాధిస్తున్న సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిని దెబ్బతీయాలనుకునే వారికి రేవంత్ రెడ్డి ఒక గొంతుకగా మారారని విజయన్ ఆరోపించారు.

కేరళలో అవినీతి, దుష్పరిపాలన ఉందని ఆరోపించే ముందు రేవంత్ రెడ్డి అధికారిక గణాంకాలను పరిశీలించాలని పినరయి విజయన్ సూచించారు. "దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని ఆయనకు తెలియదా? నీతి ఆయోగ్ ఎస్‌డీజీ ఇండెక్స్ (2023-24)లో కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే, తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మీ రాష్ట్రంలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కేరళను కించపరచడం చాలా విచారకరం" అని విజయన్ అన్నారు. 

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారమే కేరళలో పేదరికపు రేటు కేవలం 0.55 శాతం అని, ఇది దేశంలోనే అత్యల్పమని గుర్తుచేశారు. 2025 చివరి నాటికి తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవబోతోందని తెలిపారు. అదే సమయంలో తెలంగాణలో పేదరికం 5.88 శాతంగా ఉందని, అక్కడి నిరుపేదలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.

అంతేకాకుండా, కేరళలో అక్షరాస్యత 95.3 శాతం ఉండగా, తెలంగాణలో 76.9 శాతం వద్దే ఆగిపోయిందని విజయన్ చురకలంటించారు. కేరళలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) కేవలం 5గా ఉందని, ఇది అమెరికా (5.6) కన్నా మెరుగని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో ఈ రేటు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వ పాలనా నమూనాను రేవంత్ రెడ్డి విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. 

"2025 సెప్టెంబర్ 1న, తెలంగాణకు చెందిన రెవెన్యూ, సర్వే ఉన్నతాధికారుల బృందం తిరువనంతపురం వచ్చి మా డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ 'ఎంతే భూమి'ని అధ్యయనం చేసింది. ఒకవైపు మీ అధికారులు మా నమూనాను నేర్చుకోవడానికి వస్తుంటే, మరోవైపు మీరు బహిరంగంగా ఎగతాళి చేయడం ఎంతవరకు సమంజసం?" అని రేవంత్ రెడ్డిని విజయన్ ప్రశ్నించారు.

కేరళ, కేంద్ర ప్రభుత్వాల మధ్య లాలూచీ ఉందని రేవంత్ చేసిన ఆరోపణను విజయన్ కొట్టిపారేశారు. కేరళ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై, అప్పుల పరిమితిపై ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి నిజమైన 'బీ-టీమ్' అని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు పదేపదే ఆలస్యం చేసే ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి, కేరళకు నేర్పడానికి ఏమీ లేదని అన్నారు. పాలన, ప్రజా సంక్షేమం గురించి నిజమైన పాఠాలు నేర్చుకోవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రిని కేరళకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని పినరయి విజయన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Revanth Reddy
Pinarayi Vijayan
Kerala
Telangana
Kerala CM
Telangana CM
Corruption
NITI Aayog
SDG Index
Poverty Eradication

More Telugu News