Jeevan Reddy: రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమై రెండేళ్లు కాకముందే "ఈ ప్రభుత్వం పోవాలి.. మార్పు రావాలి" అనే పరిస్థితి ఏర్పడిందని జీవన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని, కానీ ఇప్పుడు అదే తరహా అసంతృప్తి రేవంత్ ప్రభుత్వంపై కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం చేశారని ఆరోపించారు.


కాళేశ్వరం ప్రాజెక్టుపై కేవలం రాజకీయ విమర్శలే తప్ప, పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణకు కేవలం రూ. 500 కోట్లు ఖర్చవుతాయని, కానీ ప్రభుత్వం ఎన్డీఎస్‌ఏ నివేదికను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రాణహిత జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలమైందని, బడ్జెట్‌లో కేవలం రూ. 152 కోట్లు కేటాయించడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టకపోతే 18 లక్షల ఎకరాల సాగుభూమి ఎడారిగా మారుతుందని, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.


భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై స్పందిస్తూ, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి తెలిపారు. తనపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... మరో రెండు వారాల్లో ఏ పార్టీలో చేరబోతున్నానో అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Jeevan Reddy
Revanth Reddy
Telangana Politics
Kaleshwaram Project
BRS
BJP
Telangana Government
Medigadda
Praanahita
Nominated Posts

More Telugu News