Chandrababu Naidu: వాళ్లు నాశనం చేశారు... మేము శాసనం చేశాం: చంద్రబాబు

రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వంగా ప్రకటించారు.


అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూనే... విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విభజన సమయంలో కూర్చోవడానికి కార్యాలయం కూడా లేని పరిస్థితి నుంచి, నేడు ఒక సుస్థిర రాజధానిని నిర్మించుకోగలిగామని గుర్తుచేసుకున్నారు. 

11 సీట్లకు పరిమితమైనా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లేదనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. సైబరాబాద్ అభివృద్ధి సమయంలోనూ ఇలాగే విమర్శలు వచ్చాయని, కానీ నేడు అది హైదరాబాద్‌కే తలమానికంగా మారిందని ఉదాహరణగా చెప్పారు. సింగపూర్ వంటి సంస్థలపై అవినీతి ఆరోపణలు చేసి రాష్ట్రం నుంచి గత వైసీపీ ప్రభుత్వం తరిమేయడం దారుణమని ధ్వజమెత్తారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, తెలంగాణకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవంతో, రెండు రాష్ట్రాల ప్రజల కోసమే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చెప్పారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని తగ్గించే పని తానెప్పుడూ చేయనని, వారి పట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉంటానని తెలిపారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
AP Capital
YS Jagan
TDP
Visakhapatnam
Tirupati
AP Politics

More Telugu News