Vijayasai Reddy: అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్య.. వివరణలోనూ తగ్గని విజయసాయిరెడ్డి

Vijayasai Reddy on Amaravati Controversy Sparks Debate
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతిపై 'కమరావతి' అంటూ ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపగా, ఆ తర్వాత ఇచ్చిన వివరణలో ఆయన అధికార కూటమితో పాటు తాను వీడిన వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే... అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో "రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి ఒక సూచన. ప్రభుత్వం కట్టేది అమరావతే తప్ప, కమరావతి కాకుండా చూచుకోండి.. తస్మాత్ జాగ్రత్త" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లోని 'కమరావతి' పదంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌తో స్పందించారు. "నిన్నటి నా ట్వీట్‌లో అమరావతిని కమరావతి కానివ్వవద్దు అన్న సూచనను చూసి గంగవెర్రులెత్తిన వారంతా, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టమైన, స్థిరమైన విధానం లేదని, అదే సమయంలో టీడీపీకి ఇసుమంతైనా చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

అంతటితో ఆగకుండా తన మాజీ పార్టీ వైసీపీ ఎంపీల తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ అలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమకుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా?" అంటూ నిలదీశారు.

2024 ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించినప్పటికీ, ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏపీ రాజకీయాలపై తరచూ స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజా వ్యాఖ్యలతో ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకున్నారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Amaravati
Andhra Pradesh
YS Jagan
TDP
Chandrababu Naidu
AP Politics
Kamaravati
Parliament Bill
Rajyasabha

More Telugu News