Madhav: చంద్రబాబు పోరాట ఫలితమే అమరావతికి చట్టబద్ధత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొనియాడారు. ఈ విజయం వెనుక వేలాది మంది రైతుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలో ఏ రాజధానికి లేని విధంగా పార్లమెంట్‌లో అన్ని పార్టీల మద్దతుతో అమరావతికి గుర్తింపు రావడం గొప్ప విషయమని ఆయన అన్నారు.


అమరావతికి పునాది వేసిన నాటి నుండి ప్రధాని మోదీ రాజధానికి అండగా నిలుస్తున్నారని మాధవ్ పేర్కొన్నారు. శంకుస్థాపన సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర జలాలు, మట్టిని తీసుకురావడం ద్వారా ప్రతి భారతీయుడిని ఈ నిర్మాణంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని, భవిష్యత్తులో ఇది ప్రపంచ స్థాయి నగరంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా అమరావతి కోసం ఆయన చేసిన పోరాటం ఫలితమే ఈ రోజు ఈ చట్టబద్ధత అని కొనియాడారు. రాజధాని ఎంపిక కమిటీలో సభ్యుడిగా పనిచేసే అవకాశం రావడం తనకెంతో గర్వకారణమని అన్నారు.


అమరావతిపై అమరేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని, అందుకే ఎన్ని కుట్రలు జరిగినా చివరకు న్యాయమే గెలిచిందని మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములైన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో అమరావతి దేశానికి ఆదర్శంగా నిలిచే గొప్ప రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Madhav
Amaravati
Andhra Pradesh
BJP
Chandrababu Naidu
Capital City
Farmers
Parliament
Central Government
Development

More Telugu News