Chandrababu: అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించడంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని రైతులు, మహిళలు నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పాల్గొన్నారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడైతే రాజధానికి శంకుస్థాపన చేశారో, అదే ఉద్దండరాయుని పాలెంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగాల మధ్య సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు రైతులు, మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని, ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిందని అభివర్ణించారు. "అమరావతి చరిత్ర శాశ్వతం, అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతం. అనేక కుట్రలను ఎదుర్కొని ప్రజా రాజధానిని సాధించుకున్నాం. ఇది ప్రజల విజయం" అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ బిల్లుకు సహకరించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక్క వైసీపీ మినహా అందరూ అమరావతికి అండగా నిలిచారని గుర్తుచేశారు.

అమరావతిని శ్మశానం అన్న వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు: చంద్రబాబు 
గత ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "అమరావతిని శ్మశానం అన్నారు, కానీ ఇవాళ పార్లమెంటులో దానికి తిరుగులేని శాసనం చేశాం. రాజధానితో మూడు ముక్కలాట ఆడిన వాళ్లు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు" అని విమర్శించారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే, ప్రజా వేదికను కూల్చి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇంత జరిగినా వైసీపీకి బుద్ధి రాలేదని, పార్లమెంటులో బిల్లుపై చర్చ జరుగుతుంటే వారి ఎంపీలు వాకౌట్ చేశారని, ప్రజలు ఆ పార్టీని బ్లాక్ అవుట్ చేయాలని పిలుపునిచ్చారు. వారి 'మావిగన్' అనే కొత్త ప్రతిపాదన అర్థం కాలేదని, వైసీపీవన్నీ బుద్ధిలేని వ్యాఖ్యలని, దుర్మార్గపు ఆలోచనలని దుయ్యబట్టారు.

ఇది ప్రజా విజయం, రైతుల త్యాగం శాశ్వతం 
రాజధాని కోసం రైతులు, మహిళలు 1631 రోజుల పాటు చేసిన వీరోచిత పోరాటాన్ని చంద్రబాబు స్మరించుకున్నారు. నాడు ఉద్యమ శిబిరాలకు తాను సతీసమేతంగా వచ్చానని, రైతుల కష్టాలు చూసి తన భార్య భువనేశ్వరి చలించిపోయి తన చేతి గాజులను విరాళంగా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. పవన్ కల్యాణ్  ముళ్ల కంచెలు దాటుకుని వచ్చి మద్దతు తెలిపారని, తాను స్వయంగా జోలె పట్టి విరాళాలు సేకరించానని చెప్పారు.

శంకుస్థాపన ప్రదేశంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు.. సాష్టాంగ ప్రణామం 
రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా హామీ ఇచ్చారు. "అమరావతి ఇక అన్‌స్టాపబుల్. ఇది అద్వితీయం, అజేయం, అజరామరం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పరిశీలించారు. పవిత్ర మట్టి, జలాలు ఉన్న వేదిక వద్ద సాష్టాంగ ప్రణామం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి దీప హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం రాజధాని చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది.
Chandrababu
Amaravati
Andhra Pradesh
AP Capital
Narendra Modi
Farmers
Capital City
uddandarayunipalem
Bhuvaneswari
YS Jagan

More Telugu News