Sanjeev Goenka: మైదానంలో వాగ్వాదం.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందడంపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓటమి అనంతరం కెప్టెన్ రిషభ్ పంత్‌, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో ఆయన మైదానంలో తీవ్రంగా చర్చిస్తున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన నేపథ్యంలో ఆయన చేసిన పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయం సాధించింది. 

మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో కెప్టెన్ పంత్‌తో గోయెంకా ఏదో సీరియస్‌గా చర్చిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. దీంతో జట్టులో ఏదో జరుగుతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గోయెంకా 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ అన్నింటికీ తెరదించారు. 

"ఇది చాలా సుదీర్ఘమైన సీజన్. అర్థవంతమైన దాన్ని నిర్మించే క్రమంలో ఇలాంటి క్షణాలు సహజం. మా కెప్టెన్, జట్టు బలం పుంజుకోగలరని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు మద్దతుగా నిలిచిన మా అభిమానులకు ధన్యవాదాలు. మేం మరింత బలంగా తిరిగి వస్తాం. ఈ సీజన్‌లో లక్నో ప్రస్థానం ఇంకా ముగిసిపోలేదు" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో ఆయన జట్టుకు, కెప్టెన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.
Sanjeev Goenka
Lucknow Super Giants
LSG
IPL 2024
Rishabh Pant
Justin Langer
Delhi Capitals
Cricket
IPL Season
Team Owner

More Telugu News