Iran: ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే?

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కేవలం పెట్రోల్, గ్యాస్ ధరలకే పరిమితం కావడం లేదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న డిజిటల్ వ్యవస్థపైనా ఈ యుద్ధ ప్రభావం పడేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సముద్ర గర్భంలోని ఆప్టిక్ ఫైబర్ కేబుళ్లకు ముప్పు వాటిల్లితే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 95 శాతం సముద్ర గర్భంలోని ‘కేబుల్స్’ ద్వారానే నడుస్తుంది. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే కీలకమైన కేబుల్స్ ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ గుండానే వెళ్తున్నాయి. భారత్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం ముంబై నుంచి యూరప్‌కు ఈ మార్గం గుండానే వెళుతుంది. ఒకవేళ యుద్ధం కారణంగా ఈ కేబుల్స్ దెబ్బతింటే భారత్‌లో ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోవడమే కాకుండా, సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఈ కేబుళ్లు దెబ్బతింటే డేటా ట్రాఫిక్ ఇతర మార్గాలకు మళ్లడంతో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గుతుంది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపులు విఫలమయ్యే అవకాశాలున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల క్లౌడ్, ఏఐ సేవలు కూడా మందగిస్తాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్త క్లయింట్లతో పనిచేసే భారత ఐటీ పరిశ్రమకు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

ఇరాన్ మద్దతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇప్పటికే ఎర్ర సముద్రంలోని కేబుళ్లను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో నౌకల లంగర్లు తగిలి కొన్ని కేబుల్స్ దెబ్బతిన్నప్పటికీ, ఇప్పుడు యుద్ధం తీవ్రమైతే వీటిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకుంటారని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత టెలికాం శాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి టెలికాం సంస్థలను ఆదేశించింది.
Iran
Iran war
Internet disruption
Red Sea cables
Submarine cables
Internet speed
Digital payments
IT industry
Houthi rebels
Telecom

More Telugu News