Lula da Silva: ఇరాన్‌పై అబద్ధాలతో అమెరికా యుద్ధం.. అణ్వాయుధాలు ఒక సాకు మాత్రమే: బ్రెజిల్ అధ్యక్షుడు లూలా

ఇరాన్‌తో అనవసర యుద్ధానికి దిగేందుకు అమెరికా ఒక అబద్ధాన్ని సృష్టించిందని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉందని లేదా వాటిని తయారు చేయడానికి ప్రయత్నిస్తోందని అమెరికా చెబుతున్న‌ది పచ్చి అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బ్రెజిల్‌లోని సియారా రాష్ట్రంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో లూలా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఇరాక్‌లో కూడా సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయంటూ అబద్ధాలు చెప్పి అమెరికా యుద్ధానికి దిగిందని, కానీ ఆ ఆయుధాలు ఎన్నడూ కనుగొనలేదని ఆయన గుర్తుచేశారు. "ఇదంతా కేవలం ఒక సాకు మాత్రమే... యుద్ధం ఎప్పుడూ దేనినీ పరిష్కరించలేదు" అని లూలా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హేతుబద్ధంగా ఆలోచించి, జోక్యం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ యుద్ధం వల్ల తమ దేశంపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని లూలా ఆవేదన వ్యక్తం చేశారు. హ‌ర్మూజ్ జలసంధి మూసివేతతో బ్రెజిల్‌లో డీజిల్ ధరలపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. తక్కువ ఆదాయం ఉన్న పౌరుల జీవనోపాధిని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఇంధన పన్నులను తగ్గించి, మార్కెట్‌పై నిఘా పెంచిందని వివరించారు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడి, చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది.

మరోవైపు ఈ దాడుల వల్ల ఇరాన్‌లో తీవ్ర ఆస్తినష్టం, మానవతా సంక్షోభం నెలకొన్నాయి. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (IRCS) ప్రకారం బుధవారం నాటికి 1,15,000కు పైగా నివాస, వాణిజ్య, విద్యా, ఆరోగ్య భవనాలు దెబ్బతిన్నాయి. 700కు పైగా విద్యాసంస్థలు ధ్వంసమైనట్లు విద్యా మంత్రిత్వ శాఖ నివేదించింది. ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం కూడా ఇరాన్‌లో పరిస్థితిపై నివేదిక విడుదల చేసింది. వైమానిక దాడుల వల్ల 309 ఆరోగ్య కేంద్రాలు, 42 అంబులెన్సులు ధ్వంసమయ్యాయని, ఏడు ఆసుప‌త్రులను ఖాళీ చేయించారని పేర్కొంది.
Lula da Silva
Brazil President
Iran
United States
Nuclear Weapons
War
Middle East Conflict
Hormuz Strait
Oil Prices
Economic Impact

More Telugu News