Artemis 2: చంద్రుడి వైపు మానవాళి అడుగులు.. ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది వెళ్లారంటే..!

చంద్రుడిపైకి మరోసారి వ్యోమగాముల ప్రయాణం ప్రారంభమైంది. దాదాపు 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు ఉదయం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ 2 వ్యోమనౌక ప్రయాణం ప్రారంభించింది. 1972లో జరిగిన చివరి అపోలో మిషన్ తర్వాత, చంద్రుడి కక్ష్యలోకి మనుషులు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ వ్యోమనౌకలో నలుగురు వ్యోమగాములు బయలుదేరారు. అయితే, వీరు చంద్రుడిపై ల్యాండ్ కారు. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి తిరిగి వచ్చేస్తారు. ఈ నలుగురు వ్యోమగాములతో కలిపి ఇప్పటి వరకు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల సంఖ్య 28కి చేరింది. అయితే, ఇందులో కేవలం 12 మంది మాత్రమే చందమామపై కాలుమోపారు.

 ఆర్టెమిస్ 2 వ్యోమగాములు వీరే..
1. రీడ్ వైస్‌మన్ (కమాండర్)
2. విక్టర్ గ్లోవర్ (పైలట్)
3. క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్)
4. జెరెమీ హాన్సెన్ (కెనడియన్ వ్యోమగామి)

ఈ నలుగురు వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రయాణించి, ఏప్రిల్ 11న తిరిగి భూమికి చేరుకుంటారు. వీరు కేవలం చంద్రుడి కక్ష్యలో ప్రయాణించి వస్తారు. దీనివల్ల భవిష్యత్తులో చంద్రుడిపై దిగబోయే ‘ఆర్టెమిస్ 3’ మిషన్‌కు అవసరమైన కీలక పరీక్షలు పూర్తవుతాయి.

అపోలో మిషన్ ల చరిత్ర..
గతంలో 1968 నుంచి 1972 మధ్య నాసా 9 సార్లు మానవ సహిత అపోలో మిషన్లను చంద్రుడి వద్దకు పంపింది. ఇప్పటివరకు మొత్తం 24 మంది వ్యోమగాములు చంద్రుడి వరకు వెళ్లగా, అందులో కేవలం 12 మంది మాత్రమే చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టారు.

అపోలో మిషన్ లలో కీలకమైనవి..
అపోలో 8 (1968): చంద్రుడి కక్ష్యలోకి చేరిన మొదటి మానవ సహిత నౌక. వీరు చంద్రుడి వెనుక భాగాన్ని నేరుగా చూసిన మొదటి వ్యక్తులు.
అపోలో 11 (1969): చరిత్ర సృష్టించిన మిషన్. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆయనతో పాటు బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడిపై నడిచారు.
అపోలో 13 (1970): ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు వల్ల ఈ మిషన్ విఫలమైంది. వ్యోమగాములు చంద్రుడిపై దిగకుండానే ప్రాణాలతో భూమికి తిరిగి రాగలిగారు.
అపోలో 15 (1971): చంద్రుడిపై మొదటిసారి 'లూనార్ రోవర్' (వాహనం) వాడిన మిషన్.
అపోలో 17 (1972): ఇది చివరి అపోలో మిషన్. యూజీన్ సెర్నాన్ చంద్రుడిపై అడుగు పెట్టిన చివరి వ్యక్తిగా నిలిచారు.

ఆర్టెమిస్, అపోలో మిషన్ లలో ప్రధాన తేడాలు..
ఆర్టెమిస్ మిషన్ కేవలం చంద్రుడిపైకి వెళ్లడం మాత్రమే కాదు, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో అంగారక గ్రహం యాత్రకు చంద్రుడిని ఒక వేదికగా మార్చుకోవడమే దీని లక్ష్యం. అయితే, అపోలో మిషన్ ల ద్వారా చంద్రుడి గురించి ప్రాథమిక అవగాహన పొందిన మానవాళి, ఇప్పుడు ఆర్టెమిస్ ద్వారా అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులను అన్వేషించబోతోంది. ఆర్టెమిస్ 2 వ్యోమగాములు చంద్రుడి పైకి వెళ్లిన వ్యోమగాముల సంఖ్యను 28కి పెంచారు, కానీ చంద్రుడిపై నడిచిన 12 మంది రికార్డు మాత్రం ఇంకా అలాగే ఉంది. భవిష్యత్తులో రాబోయే ఆర్టెమిస్ మిషన్ల ద్వారా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Artemis 2
Artemis mission
Apollo missions
Moon mission
NASA
Lunar exploration
Reed Wiseman
Christina Koch
Victor Glover
Jeremy Hansen

More Telugu News