Elon Musk: మస్క్ స్టార్‌లింక్‌ను మేం వదిలిపెట్టం.. ఇరాన్‌ వార్నింగ్

Elon Musks Starlink Will Not Be Spared Warns Iran
షార్ట్స్‌లో చూడండి
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పొరుగు దేశాల్లోని అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతామని, ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థపై విరుచుకుపడతామని స్పష్టం చేసింది. బహ్రెయిన్, కువైట్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో అక్కడి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించింది.

ఇరాన్ దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లో తరచూ ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్‌లు సంభవిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పలు దేశాలు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న సుమారు 18 అమెరికా టెక్ కంపెనీల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ తెలిపింది.

ఈరోజు నుంచి యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టెస్లా, బోయింగ్ వంటి ఇతర దిగ్గజ కంపెనీల యూనిట్లపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం సంకేతాలిచ్చింది. ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోవాలంటే తక్షణమే ఆ ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. కాగా, ఇరాన్‌లో ఇప్పటికే స్టార్‌లింక్‌పై నిషేధం అమల్లో ఉంది. ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు.
Go Back to Shorts
Elon Musk
Starlink
Iran
United States
IRGC
Gulf countries
Internet blackout
Bahrain
Kuwait
UAE

More Telugu News