NTR: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మలయాళ స్టార్ అంటూ వార్తలు.. అసలు విషయం ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రంపై నెలకొన్న ఓ కీలక ప్రచారానికి తెరపడింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే తాను ఈ ప్రాజెక్టులో భాగం కావడం లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో నిన్న తన కొత్త సినిమా ‘పల్లిచట్టంబి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన టోవినో, ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న ఊహాగానాలపై స్పందించారు. ‘డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ సినిమా చేయడం లేదు’ అని ఆయన తేల్చి చెప్పారు. తన పని విధానాన్ని వివరిస్తూ, "మలయాళంలో మేము ఒక సినిమాను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. కానీ తెలుగులో ఒక పెద్ద ప్రాజెక్టుకు దాదాపు ఏడాది సమయం పడుతుంది. నేను ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయను. ఏడాది పాటు ఒకే సినిమాకు డేట్స్ కేటాయిస్తే, మూడు నాలుగు మలయాళ చిత్రాలను వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టుకు అంగీకరించలేకపోయాను" అని తెలిపారు.

 ‘NTR31’ లేదా ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్స్‌ తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో టోవినో ప్రతినాయకుడిగా లేదా కథానాయకుడి సోదరుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా టోవినో ప్రకటనతో ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.
NTR
NTR31
Prashanth Neel
Tovino Thomas
Mythri Movie Makers
NTR Arts
Dragon Movie
Telugu cinema
Malayalam cinema
Tollywood

More Telugu News