Kalisetti Appalanaidu: జగన్ కు బుద్ధి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం బిల్లుతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోంది: టీడీపీ ఎంపీ కలిశెట్టి

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని విధ్వంసం చేయాలని చూసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇది గట్టి చెంపపెట్టు అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ చట్టంలోని సెక్షన్ 5(2)లో ఉన్న 'కొత్త రాజధాని' అనే పదాల స్థానంలో 'రాజధాని నగరం అమరావతి' అని స్పష్టంగా చేర్చనున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ .. ప్రతిపక్ష నేత హోదాలో 2014లో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా జగన్ అంగీకరించారని, తాను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నట్లు ప్రజలను నమ్మించి తీరా అధికారంలోకి వచ్చాక తన మోసపూరిత వైఖరిని జగన్ బయటపెట్టారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి బుద్ది చెప్పేలా కేంద్రం ఇప్పుడు బిల్లు పెట్టి చట్టబద్దత కల్పిస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
Kalisetti Appalanaidu
Amaravati
Andhra Pradesh
TDP MP
YS Jagan Mohan Reddy
AP Reorganisation Act 2014
Narendra Modi
Amit Shah
Andhra Pradesh Capital
Central Government Bill

More Telugu News