Kavitha: కాగ్ గణాంకాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై కవిత ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, రోజువారీ ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం ఆర్బీఐ ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ వెల్లడించిన గణాంకాలను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పెట్టారు.
కాగ్ నివేదిక ప్రకారం... గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏడాది మొత్తం మీద కేవలం రెండు రోజులు తప్ప, మిగిలిన 363 రోజులు ప్రభుత్వం ఆర్బీఐ నుండి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్‌ల పేరుతో నిధులు సేకరించిందని కవిత పేర్కొన్నారు. "సుమారు రూ. 1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చారు. 2025 మార్చి 31 నాటికి సుమారు రూ. 6 వేల కోట్లు తిరిగి చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది" అని ఆమె ఆరోపించారు.
రాష్ట్రానికి నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్నప్పటికీ, రోజువారీ ఖర్చులకు కనీసం రూ. 1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారని కవిత విమర్శించారు. రాష్ట్రంపై మొత్తం రూ. 8.65 లక్షల కోట్ల అప్పులు మోపి, ప్రతి కుటుంబంపై సగటున రూ. 9 లక్షల భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందని ధ్వజమెత్తారు. అప్పులు తెస్తూ ఇంకా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని చెప్పడం ప్రజలను వంచించడమేనని ఆమె మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో 'సంపద పెంచుతాం.. పేదలకు పంచుతాం' అని కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలు వట్టి డొల్ల అని కాగ్ నివేదికతో తేలిపోయిందని కవిత ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైందని ఆమె స్పష్టం చేశారు.