Indian Rupee: జీవితకాల కనిష్ఠానికి భారత కరెన్సీ.. 14 ఏళ్లలో అతిపెద్ద క్షీణత

భారత కరెన్సీ రూపాయి సోమవారం నాడు సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ట్రేడింగ్ చరిత్రలో తొలిసారిగా 95 మార్కును దాటింది. ఒక దశలో రూ. 95.22 వద్దకు చేరి రికార్డు పతనాన్ని నమోదు చేసింది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లకు పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడటం వంటివి రూపాయి పతనానికి ప్రధాన కారణాలని ఫారెక్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో సానుకూలంగా ప్రారంభమైన రూపాయి, ఆర్‌బీఐ సర్క్యులర్ కారణంగా రూ. 93.57 వరకు బలపడింది. అయితే, కార్పొరేట్ సంస్థల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ రావడంతో ఒక్కసారిగా క్షీణించి రూ. 95.22 కనిష్ఠానికి జారిపోయింది. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన రూపాయి, చివరికి 15 పైసల లాభంతో రూ. 94.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూపాయి విలువ 165 పైసల మేర హెచ్చుతగ్గులకు గురైంది.

గత నెల 28న పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి 4.1 శాతం మేర నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) ఇప్పటివరకు 9.88 శాతం క్షీణించింది. 2011-12 తర్వాత గత 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక పతనం కావడం గమనార్హం. ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే, సమీప భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి విలువ రూ. 100 స్థాయికి కూడా చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Indian Rupee
Rupee vs Dollar
INR to USD
Currency Depreciation
RBI
Brent Crude Oil
Stock Market
Foreign Institutional Investors
West Asia War
Indian Economy

More Telugu News