Narayana: అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారు.. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ

రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో పర్యటించిన ఆయన, గత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అమరావతిపై జగన్ తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోవాలని హితవు పలికారు.


గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పిన జగన్ ... అధికారంలోకి రాగానే మాట తప్పి 'మూడు ముక్కలాట' ఆడారని నారాయణ విమర్శించారు. భూములిచ్చిన రైతులను కంచెలేసి బంధించి, మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంత రైతుల త్యాగాలను అవహేళన చేసిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.


కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో భారీ ఎత్తున నిధులు సమకూర్చుకుని రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతోందని నారాయణ వెల్లడించారు. కేంద్రం సహకారంతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15 వేల కోట్లు... హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు... నాబార్డు నుంచి రూ. 7,500 కోట్ల నిధులు సమకూర్చుకుని అమరాతిని వేగంగా నిర్మిస్తుంటే... చూసి ఓర్చుకోలేక జగన్, బొత్స, సజ్జల వంటి నేతలు పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు.


రాజధానిపై ఇంకా విషం కక్కడం కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రస్తుతం ఉన్న ఆ 11 సీట్లు కూడా రావని నారాయణ హెచ్చరించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పనులు ఆగిపోవని ధీమా వ్యక్తం చేశారు.

Narayana
Amaravati
Jagan
YS Jagan
Andhra Pradesh Capital
TDP
YSRCP
Andhra Pradesh Politics
AP Elections
Capital City

More Telugu News