India Post: ఇండియా పోస్ట్ పేరిట ఘరానా మోసాలు

ఇండియా పోస్ట్ 170వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతులు అందిస్తోందంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో ఒక సందేశం విపరీతంగా వ్యాపిస్తోంది. అయితే ఇది పూర్తిగా నకిలీ అని, సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం దొంగిలించడానికి పన్నిన వల అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందేశంలో ఉండే లింక్‌ను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే మోసపోవడం ఖాయమని హెచ్చరించింది.

ఈ మోసంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను అప్రమత్తం చేసింది. ఇండియా పోస్ట్ ఎలాంటి లక్కీ డ్రాలు గానీ, బహుమతుల పంపిణీ గానీ నిర్వహించడం లేదని, వైరల్ అవుతున్న సందేశం ఒక స్కామ్ అని తేల్చిచెప్పింది. ‘ఇండియా పోస్ట్ పేరుతో జరుగుతున్న ఈ లక్కీ డ్రా నకిలీది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి. మీ వ్యక్తిగత వివరాలను పంచుకోకండి’ అని అధికారులు హెచ్చరించారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా ఆఫర్ లేదా ప్రకటనపై సందేహం ఉంటే, నేరుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం ఉత్తమమని వారు చెబుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండటమే సైబర్ మోసాల నుంచి రక్షణ అని సూచిస్తున్నారు.
 
India Post
India Post scam
cyber fraud
PIB Fact Check
lucky draw
social media scam
WhatsApp scam
online fraud
phishing

More Telugu News