Amit Shah: నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన

నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ఆయుధాలు పట్టుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నక్సలిజాన్ని సమర్థించేవాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని తెలిపారు.

సమాజంలో అన్యాయాలకు పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో ఉన్నాయని తెలిపారు. ఆయుధాలు పట్టడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నా, ఆదివాసీల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఎన్డీయే వచ్చాక గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయని అన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదో చెప్పాలని నిలదీశారు.

నక్సలిజం పేదరికం వల్ల విస్తరించలేదని అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని, అభివృద్ధి పనులను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కొందరు కోరుతున్నారని, కానీ వారి హింసకు బలైన వారి గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.

నక్సలిజాన్ని దెబ్బతీసిన ఘనత ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలకే దక్కుతుందని అన్నారు. "సమస్యలను ఆయుధాల ద్వారా కాదు, చర్చల ద్వారానే పరిష్కరించగలం" అని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఆయుధాలు విడిచిపెట్టిన వారితో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. బస్తర్‌లోని ఆదీవాసీలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందిస్తోందని అన్నారు.

ఇది మోదీ ప్రభుత్వమని, ఆయుధాలు పట్టుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. ఆదివాసీల అభివద్ధి జరగలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కానీ 60 ఏళ్లు వారే పాలించారని గుర్తించాలని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తమపై నిందలు మోపే ప్రయత్నం సరికాదని అన్నారు. ఏడాది కాలంలో 706 మంది మావోయిస్టులు మృతి చెందారని, 4800 మంది లొంగిపోయారని అమిత్ షా ప్రకటించారు.
Amit Shah
Naxalism
Chhattisgarh
Bastar
Naxalite
Maoist
Tribal Development
Operation Kagar

More Telugu News