Iran: మాకు అవసరం లేదు: మధ్యవర్తిత్వం వహిస్తానన్న పాకిస్థాన్‌కు ఇరాన్ షాక్

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ప్రత్యక్ష చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. పాకిస్థాన్ నేతృత్వంలో జరిపే సంధి ప్రయత్నాలలో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రయత్నాలకు ఇరాన్ నో చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోమవారం 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది.

అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే వచ్చాయని పేర్కొంది. పాకిస్థాన్ చర్చా వేదికలు వారి సొంత వ్యవహారమని, వాటిలో ఇరాన్ పాల్గొనలేదని కాన్సులేట్ స్పష్టం చేసింది. అమెరికా దౌత్యం ఎప్పటికప్పుడు మారుతుందని, మాటలు మారుస్తుందని ఆరోపించింది.

కానీ ఈ విషయంలో తమ వైఖరి సుస్పష్టమని తెలిపింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రకటన వారి సొంత ప్రణాళికలేనని తెలిపింది. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగినదేనని, కానీ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తుంచుకోవాలని ఇరాన్ కాన్సులేట్ వ్యాఖ్యానించింది.

రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ మంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై పడుతోన్న ప్రభావం గురించి వారు చర్చించారు. పాకిస్థాన్‌లో జరగబోయే ఇరాన్-అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆ దేశాల మంత్రులు పూర్తి మద్దతు ఇచ్చినట్లు ఇషాక్ దార్ ప్రకటించారు. ఇరాన్, అమెరికాతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది.
Iran
Pakistan
America
Israel
Iran-America Talks
Middle East Conflict
Mediation
Diplomacy
Ishaq Dar

More Telugu News