Anil Kumble: ఈసారి రోహిత్ చాలా ప్రమాదకారి.. అన్ని జట్లకు ముప్పే: అనిల్ కుంబ్లే

Anil Kumble Praises Rohit Sharmas Form in IPL 2026
షార్ట్స్‌లో చూడండి
ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించడంపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ తన ‘2.0 అవతార్’లోకి వచ్చేశాడని, అతని ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ సీజన్‌లో ప్రత్యర్థి జట్లకు ముప్పేనని హెచ్చరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 38 బంతుల్లో 78 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ ఇన్నింగ్స్‌పై స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో కుంబ్లే మాట్లాడుతూ.. "రోహిత్ శర్మ సరికొత్త 2.0 అవతార్‌లో వచ్చినట్లు కనిపిస్తోంది. మళ్లీ ఆధిపత్యం చెలాయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. అతను మైదానం నలువైపులా బంతిని బాదిన తీరు, అతని పాత రోజులను గుర్తుకు తెచ్చింది" అని అన్నాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి నాణ్యమైన స్పిన్నర్లపై సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదని, కానీ రోహిత్ దానిని చాలా తేలికగా చేసి చూపించాడని కొనియాడాడు.

"రోహిత్ తన ఫిట్‌నెస్‌పై చాలా శ్రమించాడు. ఒక చిన్న విరామం తర్వాత తిరిగి వచ్చినప్పుడు, లయను అందుకోవ‌డానికి ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది. కానీ, రోహిత్ అద్భుతంగా ఆడాడు. బౌండరీలు చిన్నవిగా ఉన్నప్పటికీ, అతను కొట్టిన షాట్లు నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లాయి. ఈ ఇన్నింగ్స్ చూస్తుంటే రోహిత్ ఈసారి చాలా పక్కాగా ఉన్నాడని తెలుస్తోంది. అతని ఈ వెర్షన్ మిగతా ఐపీఎల్ జట్లను కచ్చితంగా ఆందోళనకు గురిచేస్తుంది" అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

కేకేఆర్‌ వ్యూహాలను కుంబ్లే తప్పుబట్టిన కుంబ్లే
ఇదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యూహాలను కుంబ్లే తప్పుబట్టాడు. కేకేఆర్ తమ స్పిన్నర్లయిన సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలపై ఎక్కువగా ఆధారపడిందని, కానీ వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదని విమర్శించాడు. "రోహిత్, రికెల్టన్ దూకుడుగా ఆడుతున్నప్పుడు పవర్‌ప్లేలో కెప్టెన్ అజింక్య రహానే.. నరైన్‌ను బౌలింగ్‌కు తీసుకురాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నరైన్ బౌలింగ్‌కు వచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం అనుభవ లేమితో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇద్దరు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నప్పుడు, వారిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలి" అని కుంబ్లే సూచించాడు.
Go Back to Shorts
Anil Kumble
Rohit Sharma
Mumbai Indians
IPL 2026
Kolkata Knight Riders
Sunil Narine
Varun Chakravarthy
Cricket
Ajinkya Rahane

More Telugu News