Chandrababu Naidu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి పక్షాల ఐక్యతకు పవన్ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ., "రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి పక్షాల ఐక్యతకు మీరు అందిస్తున్న సహకారం అభినందనీయం. నాకున్న అనుభవానికి తోడుగా, ఉత్తమ ఆకాంక్షలు, ఆదర్శాలు కలిగిన మీ వంటి ప్రజానేతలు కలిసివస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతటి మేలు జరుగుతుందో గత 20 నెలల పాలన ఒక నిదర్శనం" అని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడిన తమ కూటమి ఐక్యతా స్ఫూర్తి ఇలాగే పదికాలాల పాటు కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో పవన్ కల్యాణ్ వంటి నేతల పాత్ర కీలకమని, ఆయన తోడ్పాటుతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళతామని చంద్రబాబు తన సందేశంలో స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఉన్న సమన్వయం రాష్ట్రానికి శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
Pawan Kalyan
TDP
Janasena
Andhra Pradesh
AP Politics
Telugu Desam Party
Alliance
State Development

More Telugu News