KTR: కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ భూ కబ్జాల పర్వం కొనసాగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


వట్టినాగులపల్లిలో సతీశ్ షా కుటుంబానికి చెందిన 27 ఎకరాల భూమిపై మంత్రి పొంగులేటి కన్ను పడిందని కేటీఆర్ ఆరోపించారు. సుమారు రూ. 1,400 కోట్ల విలువ చేసే ఈ భూమిని దక్కించుకోవడానికి జేసీబీలతో వచ్చి గోశాలను, కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారని మండిపడ్డారు. భూమి ఇవ్వకపోతే సజీవంగా పాతిపెడతామని బాధితులను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు రక్షణ కల్పించిన నిజాయతీ గల పోలీస్ అధికారి అజీబుల్లా ఖాన్‌ను మరుసటి రోజే బదిలీ చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని విమర్శించారు.


రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. నిజాం కాలం నాటి భూములను కూడా ఈ జాబితాలోకి చేర్చి, రైతులను భయాందోళనలకు గురిచేసి, భూములు గుంజుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.


మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూ కుంభకోణాలపై కేవలం సీబీసీఐడీ విచారణ సరిపోదని, వెంటనే సభా సంఘాన్ని (హౌస్ కమిటీ) వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని... పొంగులేటి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీబీసీఐడీ విచారణ పేరుతో మంత్రిని కాపాడే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.


ఇదే సమయంలో పోలీసులకు కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. "పాలకుల ఒత్తిడికి లొంగి అక్రమాలకు సహకరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు" అని హెచ్చరించారు. అక్రమాలకు అండగా నిలవవద్దని, ప్రజల పక్షాన ఉండాలని పోలీసులను కోరారు. బాధితుల పేర్లు బయటపెట్టకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

KTR
KTR BRS
Ponguleti Srinivas Reddy
Telangana Land Scam
Land Grabbing Telangana
BRS Party
Telangana News
Vattinagulapally
Ajeebulla Khan Transfer
Prohibited Land List

More Telugu News