Census 2027: జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా కలిసి జీవిస్తున్న (సహజీవనం) జంటలు తమ బంధాన్ని స్థిరమైనదిగా భావిస్తే, వారిని ‘కుటుంబం’గా గుర్తించనుంది. ఈ మేరకు రాబోయే జనగణన నిబంధనల్లో స్పష్టతనిచ్చింది.

జనగణనలో భాగంగా తొలిదశ అయిన ‘ఇళ్ల జాబితా నమోదు’, ‘గృహ గణన’ ప్రక్రియ 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. ఈ దశలో అధికారులు ప్రజలను 33 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తారు. ఇందులో భాగంగా, వివాహిత జంటల సంఖ్యను నమోదు చేసేటప్పుడు సహజీవన జంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ మొదటి దశలో ఇంటి యజమాని వివరాలు, ఇంటి నిర్మాణానికి వాడిన సామగ్రి, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్ వంటి వివరాలు సేకరిస్తారు. వీటితో పాటు ఇంట్లో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, వాహనాల వినియోగం, కుటుంబం ప్రధానంగా ఏ ఆహార ధాన్యాలు తింటుంది వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఉంటాయి.

ఈసారి జనగణన ప్రక్రియను డిజిటల్ పద్ధతిలోనూ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ‘సెల్ఫ్-ఎన్యూమరేషన్’ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. తొలి దశ పూర్తయ్యాక, 2027 ఫిబ్రవరిలో రెండో దశ అయిన ‘జనాభా గణన’ చేపడతారు. కులాల వారీగా గణన అంశంపై రెండో దశకు ముందే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
Census 2027
Live-in couples
Central Government
India Census
Household listing
Digital Census
Self-enumeration
Population Census

More Telugu News