KCR: కేసీఆర్, హరీశ్ లను సీబీఐ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?: కేంద్రాన్ని నిలదీసిన రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శాసనసభలో సూటిగా ప్రశ్నించారు. ఈ అంశాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం వద్ద ప్రస్తావించాలని ఆయన సూచించారు. సలహాలు ఇచ్చి సభ నుంచి పారిపోవడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అవినీతి, అక్రమ మైనింగ్ ఆరోపణలపై సభా సంఘం (హౌస్ కమిటీ) వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అంగీకరించాలని బీజేపీ సభ్యుడు వెంకటరమణారెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

"కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని మేం మాత్రమే కాదు, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా బీజేపీ నేతలందరూ ఆరోపించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్, హరీశ్‌రావులను జైల్లో పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టిగా చెప్పారు. వారి మాటలను నమ్మే మేము కేసును సీబీఐకి అప్పగించాం. కానీ నెలలు గడుస్తున్నా కేసీఆర్, హరీశ్‌రావులపై కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు" అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు పంచుకున్నాయని ఆయన ఆరోపించారు. ముందుగా కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావులకు శిక్ష పడేలా చూసిన తర్వాత బీజేపీ నేతలు సలహాలు ఇస్తే బాగుంటుందని ఆయన చురక అంటించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావుపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. "మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని ప్రైవేట్ పరిశ్రమల యజమానులను హరీశ్‌రావు తమ్ముడు మహేశ్‌రావు బెదిరించి 'ధరణి' పోర్టల్ ద్వారా వందల ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకున్నారు. హరీశ్‌రావు ఒప్పుకుంటే ఈ విషయంపై సభా సంఘం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్, వెంకటరమణారెడ్డికి హరీశ్‌రావు నిజాయితీపరుడని నమ్మకం ఉంటే, ఈ విచారణకు అంగీకరించాలి," అని సవాల్ విసిరారు.

మరోవైపు, అక్రమ మైనింగ్ ఆరోపణలపై సభను బీఆర్ఎస్ అడ్డుకోవడంపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014 నుంచి జరిగిన అక్రమ మైనింగ్‌పై ఇప్పటికే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని తెలిపారు. ప్రభుత్వమే విచారణకు ఆదేశించిన తర్వాత మళ్లీ సభా సంఘం అవసరం లేదని శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
KCR
Kaleshwaram Project
Revanth Reddy
Telangana Assembly
PC Ghosh Commission
Corruption allegations
Irrigation project
Medigadda barrage
CBI investigation
Telangana news

More Telugu News