Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్

Nara Lokesh Demands Jagan Clarification on Amaravati in Assembly
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుకూలమో, వ్యతిరేకమో వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన సమాధానం చెప్పాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై చారిత్రక తీర్మానం చేసేందుకు శనివారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంత కీలకమైన సమావేశం జరుగుతుంటే, ప్రతిపక్ష నేత జగన్ బెంగళూరులో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుతో ముడిపడి ఉందని అన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి.. రాష్ట్ర విభజన బాధ
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అని, ఆ నగరంతో ప్రతి ఒక్కరికీ భావోద్వేగ సంబంధం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీ తనకు తెలుసన్నారు. చంద్రబాబు ముందుచూపుతో ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించి సైబరాబాద్‌ను నిర్మించడం ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. "ఆనాడు విజన్-2020 అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు అది వాస్తవరూపం దాల్చింది. అందరం కలిసి చెమటోడ్చి అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను వదిలిరావాల్సి వచ్చింది. పార్లమెంటులో తలుపులు మూసి, చర్చ లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. కట్టుబట్టలతో మెడబట్టి బయటకు గెంటేశారన్న భావన ఇప్పటికీ నాలో ఉంది" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

లోటు బడ్జెట్, నాసిరకం భవనాలు
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన కష్టాలతో ప్రయాణం ప్రారంభించిందని లోకేశ్ వివరించారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో, రాజధాని కూడా లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఆనాడు ఏపీకి అత్యంత నాసిరకమైన భవనాలను కేటాయించి అవమానించారని గుర్తుచేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు.

అందరి మద్దతుతో అమరావతి.. మాట మార్చిన జగన్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందనే ఉద్దేశంతో, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా కృష్ణా-గుంటూరు మధ్య అమరావతిని రాజధానిగా నిర్ణయించామని లోకేశ్ తెలిపారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, "ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టను, అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను" అని శాసనసభ సాక్షిగా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జనసేన, బీజేపీ సహా అన్ని పార్టీలు అమరావతికే మద్దతు పలికాయన్నారు. కానీ, "రాజధాని అమరావతే" అని ప్రజలకు అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు ముక్కలాట ఆడారని తీవ్రంగా విమర్శించారు.

ఇది రైతుల త్యాగం.. వారి జీవితం
అమరావతి కేవలం భూమి కాదని, అదొక ఎమోషన్ అని, రైతుల త్యాగఫలమని లోకేశ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 58 రోజుల్లోనే దాదాపు 35 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారని కొనియాడారు. రైతుకు భూమి కేవలం ఆస్తి కాదని, అది వారి జీవితం, గుర్తింపు, భవిష్యత్ అని పేర్కొన్నారు. అలాంటి భూమిని త్యాగం చేసిన రైతులకు ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి నమస్కరించాలని పిలుపునిచ్చారు. ఈ రైతుల త్యాగం వల్లే ఈరోజు మనం ఈ అసెంబ్లీలో కూర్చున్నామని అన్నారు.

కుల ప్రస్తావనపై విమర్శ.. క్షమాపణ చెప్పాలి
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి కులం రంగు పులిమే ప్రయత్నం చేశారని లోకేశ్ ఆరోపించారు. ఒకే సామాజిక వర్గానికి దోచిపెడుతున్నారని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. పొన్నూరు నాగేశ్వరరావు అనే దళిత రైతు రాజధాని కోసం భూమి ఇచ్చి, పెరిగిన ధరతో తన పిల్లలను ఉన్నత చదువులు చదివించుకున్నారని ఉదహరించారు. అమరావతి వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోయాయని తెలిపారు. మాట తప్పి, మడమ తిప్పి అమరావతి రైతులను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినందుకు జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Amaravati
Andhra Pradesh
Jagan
AP Assembly
Capital City
Farmers
State Division
Hyderabad
Political News

More Telugu News