Naseem Shah: ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్

పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ను ఉద్దేశించి అతడి సోషల్ మీడియా ఖాతా నుంచి వెలువడిన ఓ పోస్ట్ తీవ్ర వివాదాస్పదం అయింది. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ప్రారంభ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు పంజాబ్ సీఎం మరియం నవాజ్ హాజరయ్యారు. ఆమె భారీ భద్రతా కాన్వాయ్‌తో స్టేడియానికి రావడం, ఆటగాళ్లతో మాట్లాడటాన్ని ఉద్దేశిస్తూ నసీమ్ షా అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఒక పోస్ట్ వెలువడింది. "ఆమెను లార్డ్స్‌లో మహారాణిలా ఎందుకు చూస్తున్నారు?" అని నసీమ్ ట్వీట్ చేశాడు. అయితే, ఈ పోస్ట్ మరియం నవాజ్‌ను విమర్శించేలా ఉందని పలువురు భావించారు.

పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని తొలగించడం గమనార్హం. ఆ పోస్ట్ చేసింది తాను కాదని, తన ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని నసీమ్ షా మరో పోస్టులో వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివరణతో పీసీబీ అధికారులు సంతృప్తి చెందలేదు. 24 గంటల్లోనే సెంట్రల్ కాంట్రాక్ట్ నిబంధనలు, మీడియా పాలసీని ఉల్లంఘించారనే ఆరోపణలతో అతనికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ వివాదం నడుస్తున్నప్పటికీ, నసీమ్ షా తదుపరి మ్యాచ్ ఆడేందుకు అందుబాటులో ఉంటాడని సమాచారం.

ప్రస్తుతం పీఎస్‌ఎల్ టోర్నీ అత్యంత కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య జరుగుతోంది. గల్ఫ్ వివాదం కారణంగా ఇంధనాన్ని ఆదా చేసేందుకు లాహోర్, కరాచీ రెండు వేదికలకే టోర్నీని పరిమితం చేశారు. ప్రేక్షకులను కూడా అనుమతించడం లేదు. మరోవైపు, జమాత్-ఉల్-అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ విదేశీ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో భద్రతా పరిస్థితులు బాగోలేనందున విదేశీ క్రికెటర్లు టోర్నీ నుంచి వైదొలగాలని సూచించింది. అయినప్పటికీ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ వంటి పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొంటున్నారు.
Naseem Shah
Pakistan Cricket
Maryam Nawaz
PSL
Pakistan Super League
PCB
Show cause notice
Lahore
Gaddafi Stadium
Social Media

More Telugu News