Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్

Tiger Woods Arrested for DUI After Car Accident in Florida
Advertisement
  • మద్యం సేవించనప్పటికీ, మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
  • యూరిన్ టెస్టుకు నిరాకరించడంతో డీయూఐ కింద కేసు నమోదు
  • గతంలోనూ డీయూఐ, పలు కారు ప్రమాదాల చరిత్ర ఉన్న వుడ్స్
  • ప్రతిష్ఠాత్మక మాస్టర్స్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన
Advertisement
ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ మరోసారి తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఫ్లోరిడా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాల ప్రభావంతో వాహనం నడిపారన్న (డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ - డీయూఐ) అనుమానంతో కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

మార్టిన్ కౌంటీ షెరీఫ్ జాన్ బుడెన్‌సీక్ తెలిపిన వివరాల ప్రకారం జూపిటర్ ఐలాండ్‌లోని తన నివాసానికి సమీపంలో వుడ్స్ తన ల్యాండ్ రోవర్ కారును అధిక వేగంతో నడిపారు. గంటకు 30 మైళ్ల (48 కి.మీ) వేగ పరిమితి ఉన్న రెసిడెన్షియల్ రోడ్డుపై ఓ ట్రక్కును దాటే ప్రయత్నంలో దానిని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కారు అదుపుతప్పి పక్కకు బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వుడ్స్ కారులో నుంచి బయటకు వచ్చారని, అయితే ఆయన మత్తులో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపించాయని షెరీఫ్ వివరించారు.

అనంతరం పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, ఆయన మద్యం సేవించలేదని తేలింది. అయితే, ఏ రకమైన మత్తు పదార్థాలు తీసుకున్నారో తెలుసుకునేందుకు చేసే యూరిన్ టెస్టుకు వుడ్స్ నిరాకరించారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. "చట్టం ఎవరికైనా ఒక్కటే. నేరానికి ఆయన శిక్ష అనుభవిస్తారు. అయితే, జైలులో ఇతర ఖైదీల వల్ల ఆయనకు ఎలాంటి హాని జరగకుండా ప్రత్యేక గదిలో ఉంచుతున్నాం" అని షెరీఫ్ పేర్కొన్నారు.

వుడ్స్‌కు ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం ఇది కొత్తేమీ కాదు. 2017లోనూ పెయిన్ కిల్లర్స్ అధిక మోతాదులో తీసుకుని, స్టార్ట్ చేసి ఉన్న కారులో నిద్రపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనపై నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు కేసు నమోదైంది. అలాగే 2021లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక మాస్టర్స్ టోర్నీలో ఆడాలా? వద్దా? అని నిర్ణయించుకుంటున్న కీలక సమయంలో ఈ అరెస్ట్ జరిగింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ... "నాకు చాలా బాధగా ఉంది. అతను నా మంచి స్నేహితుడు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు" అని అన్నారు. 50 ఏళ్ల వుడ్స్, ఇటీవలే ఏడోసారి వెన్నెముక సర్జరీ నుంచి కోలుకుని, మళ్లీ గోల్ఫ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.


Advertisement
Advertisement
Tiger Woods
Tiger Woods arrest
golf legend
DUI
driving under influence
Florida
car accident
Donald Trump
Masters Tournament
sports

More Telugu News