Rain Alert: ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ప‌లు జిల్లాల్లో వానలు

Andhra Pradesh Rain Forecast APSDMA Issues Warning
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఇవాళ‌ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, పొలాల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా టీవీ, ఫ్రిజ్ వంటి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించవద్దని, వాటిని డిస్‌కనెక్ట్ చేయడం మంచిదని తెలిపింది.

పంట నష్టాన్ని నివారించేందుకు రైతులకు సైతం అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. వరి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటలను ఆరుబయట ఆరబెట్టిన రైతులు, వాటిపై వెంటనే పట్టాలు కప్పి భద్రపరచుకోవాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు ఉరుముల సమయంలో చెట్ల కింద కాకుండా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. 
Go Back to Shorts
Rain Alert
APSDMA
Andhra Pradesh Rains
AP Weather Forecast
India Weather
Weather Warning
Lightning Strikes
Crop Damage
Farmers Advisory
Prahar Jain

More Telugu News