Pawan Kalyan: ఏపీపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు.. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో పవన్

Pawan Kalyan Thanks Arcelor Mittal for Trust in AP Steel Plant Inauguration
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రాజయ్యపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో, లక్ష మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభించడం అనేది ఈ ప్రాంత యువతకు గొప్ప వరం. ఆంధ్రప్రదేశ్‌పై, మా ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఇంత భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినందుకు ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్, సీఈఓ దిలీప్ ఉమెన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. "ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కర్బన ఉద్గారాలను (కార్బన్ ఫుట్‌ప్రింట్) పరిమితం చేసేలా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న సంస్థలను మేం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం" అని వివరించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన అన్ని సహకారాలు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Arcelor Mittal
Andhra Pradesh
steel plant
Nakkapalli
industrial development
Lakshmi Mittal
Aditya Mittal
employment
greenfield project

More Telugu News