మురళీధరన్ బౌలింగ్.. ధోనీ కీపింగ్.. సిక్సర్‌తో ముగించిన సంజు శాంసన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తమ అభిమానుల కోసం చెపాక్ స్టేడియంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్‌లో పాత, కొత్త తారలు సందడి చేయడంతో స్టేడియం మొత్తం పసుపుమయమైంది. ఈ సందర్భంగా ఆటగాళ్లు సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కొత్త ఆటగాడు, టీ20 ప్రపంచకప్ 2026 హీరో సంజు శాంసన్.. దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ను ఎదుర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ వికెట్ కీపింగ్ చేయడం ఈ సన్నివేశానికి మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. మురళీధరన్ బౌలింగ్‌లో కొన్ని బంతులను డిఫెండ్ చేసిన సంజూ, ఒక బంతికి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడబోయాడు. అయితే, బంతిని మిస్ అవ్వడంతో స్టంప్ అవుట్ చేసే సువర్ణావకాశం ధోనీకి లభించింది.

అనూహ్యంగా ధోనీ బంతిని నేరుగా కాకుండా వికెట్ల వైపు దొర్లించి స్టంప్స్ మిస్ చేశాడు. దీంతో క్రీజుకు చాలా దూరంగా ఉన్న సంజు శాంసన్ ఊపిరి పీల్చుకోగా, ధోనీ నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బంతికి కూడా శాంసన్ విఫలమైనా, చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపి అభిమానులను ఉర్రూతలూగించాడు.

ఇదే కార్యక్రమంలో ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన సంజు శాంసన్, శివమ్ దూబేతో పాటు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ ఆయుశ్‌ మ్హత్రేను ధోనీ ఘనంగా సత్కరించాడు. వారికి ప్రత్యేక జ్ఞాపికలను బహూకరించాడు. గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్‌కే, ఈసారి మినీ వేలంలో బలమైన జట్టును ఏర్పాటు చేసుకుని రికార్డు స్థాయిలో ఆరో టైటిల్‌పై కన్నేసింది.


More Telugu News