Jharkhand: ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం

Jharkhand World War II Bomb Found Near River Sparks Panic
షార్ట్స్‌లో చూడండి
ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భమ్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాల సమయంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి భారీ బాంబు ఒకటి బయటపడింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనగా, దానిని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు సైన్యం సహాయాన్ని కోరారు.

వివరాల్లోకి వెళితే, బహరాగోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పానిపాడా-నాగుడ్‌సాయి ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉన్న ఈ బాంబును గుర్తించారు. దీనిపై 'AN-M64 500 lb American-made' అని రాసి ఉండటంతో ఇది అమెరికా తయారీదని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 227 కిలోల బరువున్న ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటిదని అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలు ఎవరూ దాని దగ్గరకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. రాంచీ నుంచి వచ్చిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) దీనిని పరిశీలించి, ఇది ఇంకా యాక్టివ్‌గా ఉందని నిర్ధారించింది. అయితే, ఇంత భారీ, పాతతరం బాంబును నిర్వీర్యం చేసే నైపుణ్యం తమకు లేదని వారు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, తూర్పు సింగ్‌భమ్ ఎస్పీ (రూరల్) రిషవ్ గార్గ్ సైన్యంలోని బాంబ్ డిస్పోజల్ విభాగానికి అధికారికంగా లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండా వైమానిక దళ స్థావరం సహాయాన్ని కూడా కోరారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి, సైనిక బృందం కోసం ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Jharkhand
World War II bomb
East Singhbhum
Suvarnarekha River
Baharagoda Police Station
Bomb disposal squad
AN-M64
American-made bomb
Rishav Garg
Kalaikunda Air Force Station

More Telugu News