Talasani Srinivas Yadav: సనత్ నగర్‌లో చలివేంద్రాలు, అన్నదానాన్ని ప్రారంభించిన తలసాని!

Talasani Srinivas Yadav Inaugurates Free Food and Water Distribution in Sanath Nagar
షార్ట్స్‌లో చూడండి

ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అండగా నిలవడాన్ని మించిన గొప్ప కార్యం మరొకటి లేదని సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ పరిధిలోని బీకే గూడ పార్క్ వద్ద 'శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కేంద్రం, చలివేంద్రాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సేవ చేయాలనే సంకల్పం ఉన్న సీనియర్ సిటిజన్‌లను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.


2011 నుంచి ప్రతి ఏటా వేసవి కాలంలో సుమారు 70 రోజుల పాటు నిరంతరాయంగా పేదలకు రుచికరమైన భోజనాన్ని అందిస్తుండటంపై తలసాని హర్షం వ్యక్తం చేశారు. "ఉద్యోగ విరమణ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఈ వయసులోనూ సేవ చేస్తున్న సీనియర్ సిటిజన్‌లు అందరికీ ఆదర్శం" అని ఆయన కొనియాడారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని సీనియర్ సిటిజన్లు చూపుతున్న ఈ చొరవ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు.


తనను కలవడానికి వచ్చినప్పుడు శాలువాల కోసం డబ్బు వృథా చేయవద్దని... ఆ డబ్బును కూడా సేవా కార్యక్రమాలకే వినియోగించండని తలసాని చెప్పారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న మీరందరూ తన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, వయసులో పెద్దవారైన మీ ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని ఆయన కోరారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వయసు రీత్యా అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించవద్దని సూచించారు.
Go Back to Shorts
Talasani Srinivas Yadav
Sanath Nagar
Telangana
Free food distribution
Summer
Charitable Trust
BRS MLA
Drinking water
BK Guda Park
Senior Citizens

More Telugu News