కరోనా కుట్రదారు ఫౌచీనే.. వుహాన్ ల్యాబ్‌కు నిధులు ఇచ్చింది ఆయనేనంటూ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు!
- అమెరికా మాజీ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సంచలన పత్రాలు విడుదల
- కరోనా మూలాల గురించి ఫౌచీ నిఘా సంస్థలను తప్పుదోవ పట్టించారని వెల్లడి
- కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని తులసి ఆరోపణ
- ఫౌచీ వాదనలను వ్యతిరేకించిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని ప్రకటన
అబద్ధాలు, కుట్రలతో నిజాలను దాచిపెట్టారు
తులసి గబ్బార్డ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును మిలియన్ల కొద్దీ డాలర్లను ఫౌచీ వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ)కి మళ్లించారు.
గబ్బిలాలపై కరోనా వైరస్‌ల జన్యు మార్పులకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన 'గెయిన్-ఆఫ్-ఫంక్షన్' పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. కోవిడ్-19 వైరస్ ల్యాబ్ నుంచే లీక్ అయిందన్న నిజాన్ని దాచిపెట్టేందుకు, ఫౌచీ తనకున్న అధికారంతో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిఘా వర్గాలను తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు.
"2024 జూన్‌లో యూఎస్ కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి మరీ ఫౌచీ అబద్ధాలు చెప్పారు. వైరస్ పరిశోధనల గురించి నిఘా అధికారులతో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పడం పచ్చి అబద్ధం. ఈ పత్రాలు ఆయన అబద్ధాలను, కోవిడ్-19పై నిఘా వర్గాల అంచనాలను ప్రభావితం చేయడంలో ఆయన పోషించిన ప్రత్యక్ష పాత్రను బయటపెడుతున్నాయి" అని తులసి గబ్బార్డ్ కార్యాలయం తన ప్రకటనలో తీవ్రంగా విమర్శించింది.
దాదాపు 38 ఏళ్ల పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) అధిపతిగా పనిచేసిన ఫౌచీ, భారీ ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై, ట్రిలియన్ డాలర్ల విలువైన 'యూనివర్సల్ వ్యాక్సిన్‌ల' కోసం ప్రమాదకర పరిశోధనలకు నిధులు అందించారని కూడా ఆరోపించారు.
నిఘా వ్యవస్థను ఎలా తప్పుదోవ పట్టించారంటే?
మహమ్మారి సమయంలో వైరస్ సహజంగా జంతువుల నుంచి పుట్టిందని ప్రపంచాన్ని నమ్మించడానికి ఫౌచీ తెరవెనుక చక్రం తిప్పారని తులసి గబ్బార్డ్ వివరించారు. తన ప్రమాదకరమైన పరిశోధనలను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఈ నాటకం ఆడారని ఆరోపించారు. "ఫౌచీ ఒక పద్ధతి ప్రకారం నిఘా వ్యవస్థను తప్పుదోవ పట్టించారు. ఎన్ఐఏఐడీ నుంచి నిధులు పొందిన శాస్త్రవేత్తలనే నిపుణులుగా నిఘా వర్గాలకు పరిచయం చేశారు. వారిచ్చిన సమాచారమే అధికారిక నివేదికలుగా మారాయి. ఆ నివేదికలనే శాస్త్రీయ ఏకాభిప్రాయంగా చూపిస్తూ, ల్యాబ్-లీక్ సిద్ధాంతాన్ని ఖండించారు" అని ప్రకటనలో పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగం.. కక్ష సాధింపులు
ఫౌచీ ఉపయోగించిన ఎత్తుగడలు 'డీప్ స్టేట్ ప్లేబుక్' నుంచి నేరుగా తీసుకున్నవేనని తులసి గబ్బార్డ్ దుయ్యబట్టారు. "సంవత్సరాల తరబడి అబద్ధాలు, కుట్రల తర్వాత అమెరికా ప్రజలకు నిజం, పారదర్శకత, జవాబుదారీతనం అవసరం. ఫౌచీ వంటి నాయకులు తమ తప్పులను, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిఘా వ్యవస్థను తారుమారు చేశారు. కాంగ్రెస్‌కు అబద్ధాలు చెప్పారు. దేశ భద్రతకు అవసరమైన కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి చేరకుండా అడ్డుకున్నారు" అని ఆమె అన్నారు.
ఫౌచీ వాదనలను సవాలు చేసిన నిఘా విశ్లేషకులు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొన్నారని, వారిపై కక్ష సాధింపు చర్యలు జరిగాయని, కెరీర్‌లో వెనక్కి నెట్టేశారని పలువురు విజిల్ బ్లోయర్‌ల సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని ఆమె కార్యాలయం తెలిపింది.
ఈ ఆరోపణలపై డాక్టర్ ఫౌచీ నుంచి తక్షణమే ఎలాంటి స్పందన రాలేదు. తులసి గబ్బార్డ్ చేసిన ఈ సంచలన ఆరోపణలతో కరోనా మూలాలపై చర్చ మరోసారి అంతర్జాతీయంగా తీవ్రరూపం దాల్చింది.