రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా నవ భారత నిర్మాణం జరగాల్సి ఉంది: మహేశ్ గౌడ్
- రాహుల్ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్ లో కేక్ కట్ చేసిన మహేశ్ గౌడ్
- నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాహుల్ లక్ష్యమని వెల్లడి
- కార్పొరేట్ పెత్తందారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ‘గాంధీ భవన్’లో వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భారీ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ... దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, సమాన అవకాశాలు కల్పించడమే రాహుల్ గాంధీ ప్రధాన రాజకీయ లక్ష్యమని అన్నారు. "దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి కీలక సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో స్పష్టమైన మార్పు రావాలి" అని చెప్పారు.
రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువత సాధికారతతో కూడిన నవ భారత నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కేవలం కొద్దిమంది కార్పొరేట్ పెత్తందారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు మరింత సేవలందించేందుకు రాహుల్ గాంధీకి భగవంతుడు దీర్ఘాయుష్షును, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.