'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..!

'ధురంధర్: ది రివెంజ్' ('ధురంధర్ 2') చిత్రం థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనతో పాటు సినీ పరిశ్రమ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని మెచ్చుకోగా, తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఈ సినిమాను కొనియాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒక విస్ఫోటనంలా ఉంది: మహేశ్ బాబు
'ధురంధర్ 2' సినిమాపై మహేశ్ బాబు 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. "ఈ సినిమా ఒక పెను విస్ఫోటనంలా ఉంది. ఎంతో కచ్చితత్వంతో తెరకెక్కించారు. రణ్‌వీర్ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం, స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వదగ్గ అనుభూతిని అందించింది. నటుడు మాధవన్ నటన, శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఇది కచ్చితంగా థియేటర్లలో అనుభూతి చెందాల్సిన సినిమా. చిత్ర బృందానికి నా అభినందనలు" అని మహేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మాస్టర్‌క్లాస్ ప్రదర్శన: తార‌క్‌
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. "భారత ప్రేక్షకులకు ఒక తుపానును అందించిన 'ధురంధర్ 2' బృందానికి నా సెల్యూట్. రణ్‌వీర్ నటన అద్భుతం. తెరపై ఆయన ఒక మాస్టర్‌క్లాస్ ప్రదర్శించారు" అని కొనియాడారు. దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. "ఇలాంటి సినిమాను తెరకెక్కించడానికి ఎంతో ధైర్యం, నిర్భయమైన విజన్ కావాలి. ప్రతీ సన్నివేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. భావోద్వేగాలను తట్టిలేపి, సినిమా ముగిశాక కూడా మనతో ఉండే చిత్రమిది" అని వివరించారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ నటనను కూడా తార‌క్‌ మెచ్చుకున్నారు. 

ఈ అగ్ర హీరోలే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్, ప్రీతి జింటా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా 'ధురంధర్ 2'పై పాజిటివ్ రివ్యూలు పంచుకున్నారు. విడుదలైన నాటి నుంచి కేవలం ప్రేక్షకులనే కాకుండా పరిశ్రమలోని అగ్ర తారలను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.


More Telugu News