కవిత పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'.. నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ!
తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త రాజకీయ శక్తి పురుడుపోసుకోబోతోంది. బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన కొత్త పార్టీ పేరును 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) గా ఖరారు చేశారు. అయితే, ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులపై ఆమె దేశ రాజధానిలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు నేడు ఢిల్లీ హైకోర్టులో జరగబోయే విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది జనవరి 23న తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇంతవరకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, గత విచారణలో ఎన్నికల సంఘం తరపు న్యాయవాది స్పందిస్తూ... కవిత దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 27న జరగాల్సిన విచారణ, కవిత తరపు న్యాయవాది అనారోగ్యం కారణంగా నేటికి వాయిదా పడింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు నేడు కవిత బృందం ఇచ్చే వివరణపై 'తెలంగాణ ప్రజా జాగృతి' భవిష్యత్తు ఆధారపడి ఉంది.
తొలుత ఉగాది పర్వదినం నాడే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించాలని కవిత భావించారు. కానీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ ప్రకటన మే నెలకు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 'తెలంగాణ జాగృతి' సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె, ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సిద్ధమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట లేదా బోధన్ నుండి పోటీ చేసే యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ తన పేరును బీఆర్ఎస్‌గా మార్చుకున్న తర్వాత, పార్టీ పేరులో 'తెలంగాణ' అనే పదం లేకపోవడం ఆ పార్టీకి ఒక బలహీనతగా మారింది. దీనినే అస్త్రంగా చేసుకున్న కవిత, తన పార్టీ పేరులో 'తెలంగాణ' ఉండేలా జాగ్రత్త పడ్డారు. తద్వారా అసలైన తెలంగాణ సెంటిమెంట్‌ను తానే మోస్తున్నాననే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ కంటే భిన్నంగా, స్వతంత్ర రాజకీయ అస్తిత్వం కోసం కవిత చేస్తున్న ఈ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.