తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు భరోసా.. దేశంలోనే తొలిసారిగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్

  • తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీని అరికట్టేందుకు అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు
  • ఈ నెల 21న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ల్యాబ్ ప్రారంభం
  • దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ల్యాబ్ నిర్మాణం
  • రికార్డు స్థాయిలో కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసిన అధికారులు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశం దేశవ్యాప్తంగా సృష్టించిన కలకలం నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఏపీ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పటిష్ఠ చర్యలు చేపట్టాయి. శ్రీవారి ప్రసాదాల స్వచ్ఛతను కాపాడటమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా తిరుమలలో అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఈ నెల 21న ఈ ల్యాబ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు, టీటీడీ, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ల సంయుక్త పర్యవేక్షణలో ఈ ల్యాబ్ రూపుదిద్దుకుంది. మొత్తం 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.19.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల కోసం అదనంగా మరో రూ.60 లక్షలు ఖర్చు చేశారు. విశేషమేమిటంటే ఈ అత్యాధునిక ల్యాబ్‌ను కేవలం 9 నెలల రికార్డు సమయంలో పూర్తి చేయడం. ఈ ల్యాబ్ ఏర్పాటుతో ఇకపై ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి, నూనె, పాలు, పప్పు దినుసులు వంటి ముడిసరకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించే అవకాశం ఉంటుంది.

ఈ ల్యాబ్‌లో అత్యంత సూక్ష్మస్థాయి కల్తీని కూడా గుర్తించేందుకు వీలుగా ఎల్సీఎంఎస్, ఐసీపీ-ఎంఎస్‌, బాంబ్ కెలోరీమీటర్, అటామిక్ ఎబ్జార్షన్ స్పెక్ట్రోమీటర్ (ఏఏఎస్) వంటి అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. వీటితో పాటు తాగునీటిలోని క్లోరైడ్, సల్ఫేట్ వంటి రసాయనాల శాతాన్ని కూడా కచ్చితంగా కొలవవచ్చు. ఈ ల్యాబ్‌లో రసాయన, మైక్రోబయాలజీ విభాగాలు ఉన్నాయి.

త్వరలో వాసన, రుచిని బట్టి కల్తీని గుర్తించే ఈ-నోస్, ఈ-టంగ్ పరికరాలు
మరో రెండు నెలల్లో ఈ ల్యాబ్‌కు మరింత ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రానుంది. టీటీడీ అభ్యర్థన మేరకు కేంద్రం రూ.3 కోట్లు మంజూరు చేయడంతో 'ఈ-నోస్', 'ఈ-టంగ్' అనే ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ పరికరాల ద్వారా నెయ్యి శాంపిల్‌ను పరీక్షిస్తే.. దాని వాసన, రుచి ఆధారంగా అది స్వచ్ఛమైనదా? లేక కల్తీ జరిగిందా? అనే విషయాన్ని క్షణాల్లో తేల్చేయవచ్చు. ఈ ల్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో ఇకపై ప్రసాదాల నమూనాలను పరీక్షల కోసం బయటి ల్యాబ్‌లకు పంపాల్సిన అవసరం ఉండదు.

TTD
Tirumala Tirupati Devasthanams
Tirumala
Food Safety Lab
FSSAI
Ladoo Prasadam
Andhra Pradesh
Chandra Babu Naidu
prasadam quality
e-nose e-tongue

More Telugu News