Yuzvendra Chahal: ఐపీఎల్ 2026 కోసం మద్యానికి గుడ్‌బై.. ఆరు నెలలుగా తాగడం లేదన్న‌ చాహల్

Yuzvendra Chahal Reveals Fitness Focus Ahead of IPL 2026
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా వెటరన్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌ కోసం తనను తాను కొత్తగా సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత ఆరు నెలలుగా మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో చాహల్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా చాహల్ మాట్లాడుతూ... "నేను మద్యం సేవించడం మానేసి ఆరు నెలలకు పైనే అవుతోంది. ప్రస్తుతం నా వయసు 35 ఏళ్లు. మైదానంలో మరింత చురుకుగా ఉంటూ నా జట్టు కోసం 150 శాతం ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను. జట్టులో సీనియర్ ఆటగాడిగా, ఇతరులు నా నుంచి ఏదైనా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను" అని తెలిపాడు. ఫిట్‌నెస్ స్థాయులను పెంచుకుని, పూర్తి ఆత్మవిశ్వాసంతో సీజన్‌లో అడుగుపెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.

గత ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఫైనల్ వరకు దూసుకెళ్లింది. అయితే, ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కేవలం 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ ఓటమి ఇప్పటికీ తనను బాధిస్తోందని చెప్పిన చాహల్, ఫైనల్‌లో ఓటమికి గల ప్రధాన కారణాన్ని కూడా వివరించాడు. "ఆ ఫైనల్‌లో మేము మార్కో యాన్సెన్‌ను చాలా మిస్ అయ్యాం. అతను జట్టులో ఉండి ఉంటే, మేము కచ్చితంగా ఛాంపియన్‌గా నిలిచేవాళ్లం" అని అభిప్రాయపడ్డాడు. టోర్నీ అంతటా యాన్సెన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడని, చివరిలో భారీ సిక్సర్లు కొట్టగల అతని సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడేదని గుర్తుచేసుకున్నాడు.

అంతేగాక‌ గత సీజన్ చివరి దశలో తన ప్రదర్శన పట్ల కూడా నిరాశగా ఉన్నానని చాహల్ అంగీకరించాడు. "కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత నా పక్కటెముక విరిగింది. ఆ తర్వాత నా వేలికి కూడా ఫ్రాక్చర్ అయింది. ఆ గాయాల కారణంగా సెమీఫైనల్, ఫైనల్‌లో నా అసలైన లెగ్ స్పిన్ బౌలింగ్ చేయలేకపోయాను. అందుకే ఈ ఏడాది నా శరీరంపై పూర్తి శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను" అని చాహల్ స్పష్టం చేశాడు.
Go Back to Shorts
Yuzvendra Chahal
IPL 2026
Punjab Kings
Indian Premier League
Cricket
AB de Villiers
Marco Jansen
Fitness
Alcohol
Leg Spin

More Telugu News