భారత్‌లో బతుకు భారం: ఖర్చుల్లో ముంబై టాప్.. కొనుగోలు శక్తిలో హైదరాబాద్ బెస్ట్!
- భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
- ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ జీవన వ్యయం
- కొనుగోలు శక్తిలో హైదరాబాద్, పూణె నగరాలు ముందంజ
- సామాన్యుడిపై నిత్యావసరాలు, రవాణా ఖర్చుల భారం
- మెట్రో నగరాల్లో కోల్‌కతా అత్యంత చౌకైనదిగా గుర్తింపు
నివేదిక ప్రకారం.. ముంబైలో నలుగురు సభ్యులున్న కుటుంబం అద్దె లేకుండా జీవించాలంటే నెలకు సుమారు రూ. 98,000 అవసరమని అంచనా. అదే ఒంటరి వ్యక్తికి రూ. 27,300 వరకు ఖర్చవుతుందని తెలిపింది. ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరు నగరాలు అధిక వ్యయంతో కూడినవిగా ఉన్నాయి. అయితే, ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త అందుబాటు ధరల్లో ఉండటం గమనార్హం. అన్ని మెట్రో నగరాల్లోకెల్లా కోల్‌కతా అత్యంత చౌకైన నగరంగా నివేదికలో తేలింది.
నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. లీటర్ పాలు సగటున రూ. 61, కిలో బియ్యం రూ. 56 పలుకుతున్నాయి. ఇక రవాణా, యుటిలిటీ బిల్లుల భారం అదనం. 85 చదరపు గజాల అపార్ట్‌మెంట్‌లో కనీస వసతులకే నెలకు రూ. 3,500 పైగా ఖర్చవుతోంది.
జీవన వ్యయం ఎంత ఉన్నా, ప్రజల కొనుగోలు శక్తి (Purchasing Power) విషయంలో హైదరాబాద్, పూణె నగరాలు ముందంజలో ఉన్నాయి. ఈ నగరాల్లో లభించే వేతనాలకు, అయ్యే ఖర్చులకు మధ్య మెరుగైన సమతుల్యత ఉందని, ఫలితంగా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు బాగున్నాయని నివేదిక విశ్లేషించింది.