సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కీలక ప్రకటన చేసింది. రెగ్యులర్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం పాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో తొలి కొన్ని మ్యాచ్‌లకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. యువ సంచలనం అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

"గాయం నుంచి కోలుకుంటున్నందున పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడు. అతను తిరిగి వచ్చే వరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా, అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటారు" అని సన్‌రైజర్స్ తమ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేసింది.

గతేడాది డిసెంబర్ లో వెస్టిండీస్ పర్యటన తర్వాత వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్, అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే అతను యాషెస్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లు, 2026 టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ మలి దశలో అతను జట్టుతో చేరే అవకాశం ఉంది.

2025 నుంచి సన్‌రైజర్స్ జట్టులో ఉన్న ఇషాన్ కిషన్, ఇటీవల దేశవాళీ సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన జార్ఖండ్ జట్టుకు విజయవంతంగా నాయకత్వం వహించాడు. అయితే, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతనికి ఇదే తొలిసారి కావడం విశేషం. ఐపీఎల్ 2016 విజేత అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, తమ 2026 సీజన్ ను ఈ నెల‌ 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగనున్న మ్యాచ్‌తో ప్రారంభించనుంది.

ఇక‌, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో ఇషాన్, అభిషేక్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. అయితే, అనుభవంలో 27 ఏళ్ల ఇషాన్ సీనియర్ కావడంతో అతనికి కెప్టెన్సీ దక్కింది. ఇషాన్ ఇప్పటివరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, 25 ఏళ్ల అభిషేక్ 77 మ్యాచ్‌లలో ఆడాడు. కమిన్స్ సారథ్యంలో ఎస్ఆర్‌హెచ్‌ 30 మ్యాచ్‌లు ఆడి 15 విజయాలు సాధించింది. 2024లో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లగా, గత సీజన్‌లో ఆరో స్థానంలో నిలిపాడు.


More Telugu News