ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'

తమిళంలో రీసెంటుగా థియేటర్లకు వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్, ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది. సైకలాజికల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఆ సినిమా పేరే 'ఫోర్త్ ఫ్లోర్'. రాజా నిర్మించిన ఈ సినిమాకి సుందరపాండి దర్శకత్వం వహించాడు. ఆరి అర్జునన్ .. దీప్సిక .. పవిత్ర ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా నెల తిరగకుండానే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. 

ఈ సినిమా ఓటీటీ హక్కులను  'సన్ నెక్స్ట్' వారు తీసుకున్నారు. ఈ నెల 20 వతేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక ప్రకటన వదిలారు. ధరణ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, తలైవాసల్ విజయ్ .. సుబ్రమణియన్ శివ .. ఆదిత్య కథిర్ .. బేబీ శ్రీవర్షిణి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు.  

కథ విషయానికి వస్తే .. ఒక రోజున ధీరన్ కి అనూ కాల్ చేసి చెన్నై లో తనని కలుసుకోవడానికి రమ్మంటుంది. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్న ధీరన్ చెన్నైకి వెళతాడు. అనూ చెప్పిన సమయానికి కలవకపోవడంతో, అక్కడే ఒక అపార్టుమెంటులోని 'ఫోర్త్ ఫ్లోర్'లో దిగుతాడు. అప్పటి నుంచి అతనికి అక్కడ చిత్రమైన అనుభవాలు ఎదురవడం మొదలవుతుంది. అందుకు కారణం ఏమిటనేది అన్వేషించే సమయంలో అతనికి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ.



More Telugu News