ఆ ఒక్క మాటతో నా బావ తమన్ ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచాడు: హరీశ్ శంకర్

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్ లో కొందరి గురించి మాట్లాడలేకపోయానని, అందుకోసమే ఈ వీడియో అని వెల్లడించారు. అందులో సంగీత దర్శకుడు తమన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వాస్తవానికి ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడని, తాను కేవలం నేపథ్య సంగీతం (బీజీఎం) మాత్రమే అందిస్తున్నందున ఈవెంట్‌కు రాలేనని తమన్ చెప్పినట్లు హరీశ్ శంకర్ వెల్లడించారు. 

"హాయ్ గైస్... ఇప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వచ్చాను. చివరిగా, మా బావ తమన్ గురించి చెప్పాలి. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ పూర్తయింది. అతి త్వరలోనే ఓవర్సీస్‌కు కంటెంట్ పంపించడానికి కూడా సిద్ధం అవుతున్నాం. బావా, నీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. నిజంగా కల్యాణ్ గారు కూడా నీ గురించే మాట్లాడారు. 'థాంక్స్' అనేది చాలా చిన్న పదం అవుతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చానో నీకు తెలుసు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా కాకుండా, నా స్నేహితుడిగా, నా బావగా నువ్వు పడిన కష్టానికి, ఇచ్చిన సమయానికి థాంక్స్ సరిపోదు. రెండు చేతులెత్తి మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

తమన్ బీజీఎం అంటే ఏంటో, ముఖ్యంగా అది పవన్ కల్యాణ్ గారికి కొట్టినప్పుడు ఎలా ఉంటుందో మీకు ముందే తెలుసు. ఈసారి తమన్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కుమ్మి కుమ్మి కుమ్మి కొట్టేశాడు. మీరు మొన్న ట్రైలర్‌లో చూశారు, రేపు సినిమాలో చూస్తారు. తమన్ వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ డబుల్ అయిందని చెప్పొచ్చు. అతని మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేను. రేపు ఆ సౌండ్, ఆ రీసౌండ్ మీరే వింటారు. లవ్ యూ బావా, ఒక స్నేహితుడు అంటే ఏంటో మరోసారి నిరూపించావు. నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను.

తమన్ గురించి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఈ ఈవెంట్‌కు దేవిశ్రీ ప్రసాద్ గారు బిజీగా ఉండి రాలేకపోయారు. నేను బావకు ఫోన్ చేసి, ‘దేవి రావట్లేదు, నువ్వైనా రా బావా. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఎలా?’ అని రిక్వెస్ట్ చేశాను. దానికి తను, ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. నేను కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా. నన్ను స్టేజ్ మీదకు ఎందుకు పిలుస్తున్నావ్? పైగా సినిమాను 26 నుంచి 19కి మార్చావు. నాకే మ్యూజిక్ చేయడానికి టైం లేదు, ఇంకా ఈవెంట్‌కు ఎక్కడికి వస్తానురా’ అన్నాడు.

ఈ ఒక్క మాటతో తమన్ సంస్కారం నా దృష్టిలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది. బావా, నువ్వు అంటుంటావు కదా... లిరిక్స్ విషయంలో నా నుంచి వచ్చే కంటెంట్ నీకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అని. కానీ ఈరోజు నీ సంస్కారం, నీ మాట, నీ ప్రవర్తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హాట్స్ ఆఫ్ బావా, హాట్స్ ఆఫ్" అంటూ హరీశ్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలో రాశీ ఖన్నా గురించి కూడా మాట్లాడారు.





More Telugu News