RCB: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి

RCB IPL Matches Allowed at Bangalore Chinnaswamy Stadium
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్‌లకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే రెండో హోమ్ గ్రౌండ్ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణసింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో ఒక ప్లేఆఫ్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గత సంవత్సరం జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, జస్టిస్ కున్హా నివేదిక సిఫార్సులను అనుసరించి, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా చర్యలను ప్రవేశపెట్టినట్లు కార్యదర్శి సంతోష్ మీనన్ వెల్లడించారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా 35 వేల మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి మ్యాచ్‌కు మూడు నుంచి నాలుగు గంటల ముందే స్టేడియం గేట్లను తెరుస్తారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. మ్యాచ్ టిక్కెట్ కలిగి ఉన్న వారికి బెంగళూరు మెట్రోలో ఉచిత ప్రయాణ వసతి కల్పించనున్నారు.
Go Back to Shorts
RCB
Royal Challengers Bangalore
IPL matches
Chinnaswamy Stadium
Bangalore
Karnataka government

More Telugu News