హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం: తెలంగాణ గవర్నర్

హైడ్రా ద్వారా రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శ్రమించేతత్వం కలిగిన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అని ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజాకేంద్రీకృత పాలన ప్రభుత్వం విధానమని అన్నారు.

విజన్ 2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్ మ్యాప్ రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరుకుందని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్‌ను అనుసరిస్తున్నామని అన్నారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకుంటుందని అంచనాలు ఉన్నట్లు తెలిపారు.

ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని గవర్నర్ తెలిపారు. ప్రతి  వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. జీహెచ్ఎంసీని ఇటీవల మూడు కార్పొరేషన్లుగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించినట్లు తెలిపారు. బయో ఆసియా సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.

ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా కొనసాగుతోందని అన్నారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఈ రంగంలో 9.39 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో రూ.8,744 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామని వెల్లడించారు. పంట రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. సాగునీటి రంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కొత్తగా తమ ప్రభుత్వం 15.12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, 3.38 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా అయ్యాయని అన్నారు. స్వయం సహాయక బృందాలకు లక్ష కోట్ల రూపాయల రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈగల్ ప్రత్యేక సంస్థ ద్వారా డ్రగ్ సమస్యలను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నియామక బోర్డులను సంస్కరించినట్లు తెలిపారు. 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని గవర్నర్ తెలిపారు.


More Telugu News