అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, టీజీ భరత్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.


సుమారు 6.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ 'స్మృతివనం'లో కేవలం విగ్రహమే కాకుండా, ఒక మ్యూజియం, ఆడిటోరియం, ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాముల త్యాగ ఫలమే నేటి ఆంధ్ర రాష్ట్రమని, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఈ 'త్యాగ విగ్రహాన్ని' (Statue of Sacrifice) ప్రతిష్టించడం ద్వారా ఏపీ చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోనుంది.



More Telugu News